- త్వరలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తం
- అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు
- మొత్తం రూ.8,820.47 కోట్ల పెండింగ్బకాయిలు: అడ్లూరి
- బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలన్న అక్బరుద్దీన్
- రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై వాడి..వేడి చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిల చెల్లింపు అంశంపై త్వరలోనే ప్రభుత్వం తరపున ఆల్ పార్టీ మీటింగ్ఏర్పాటు చేస్తామని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. రీయింబర్స్‌మెంట్ పథకం మరింత పారదర్శకంగా, కేవలం అర్హులైన విద్యార్థులకు మాత్రమే చేరేలా మార్గదర్శకాలు రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెండింగ్స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్బకాయిలపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది.
ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉండటం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్అన్నారు. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలన్నారు. 2014–15 నుంచి 2025–26 వరకు ప్రీ–మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ స్కీంకు సంబంధించి జరిగిన చెల్లింపులు, పెండింగ్ వివరాలను లబ్దిదారుల సంఖ్యతో పాటు రిజెక్ట్చేసిన సంఖ్య వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు ఆదేశాలకు, ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. కొత్త జీవోలు తీసుకురావాల్సిన అవసరం ఉందని..దీనికోసం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
మొత్తం8,820.47 కోట్ల బకాయిలు: అడ్లూరి
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ స్కీంలో నాలుగు విభాగాల్లో కలిపి మొత్తం రూ.8,820.47 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లుగా అడ్లూరి అసెంబ్లీలో ప్రకటించారు. 2014 నుంచి ఇప్పటి వరకు పోస్ట్ మెట్రిక్ విభాగంలో కోటి 36 లక్షల 33 వేల 189 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.27,162.59 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.18,570.97 కోట్లు మాత్రమే చెల్లించిందని తెలిపారు. ముఖ్యంగా 2019–20 విద్యా సంవత్సరం నుంచే పోస్ట్ మెట్రిక్ బకాయిలు భారీగా పెరిగిపోయినట్లుగా మంత్రి వెల్లడించారు.
2019–20లో రూ.39.50 కోట్లు, 2020–21లో రూ.201.10 కోట్లు పెండింగ్‌లో ఉండగా.. ఆ తర్వాత ఏడాది నుంచి బకాయిలు భారీగా పెరిగినట్లుగా మంత్రి తెలిపారు. 2021–22లో రూ.908.58 కోట్లు, 2022–23లో రూ.1,928.69 కోట్లు, 2023–24లో రూ.1,609.12 కోట్లు, 2024–25లో రూ.1,884.99 కోట్లు, 2025–26లో రూ.2,019.65 కోట్లు బకాయిలు ఉన్నట్లుగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో నిధులు సమకూరుస్తూ, పెండింగ్ బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు: పాయల్ శంకర్
రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్అన్నారు. లెక్చరర్లకు జీతాలు చెల్లించలేక ఇప్పటికే అనేక ప్రైవేట్కాలేజీలు మూతపడ్డాయని చెప్పారు. అన్నింటికీ గత బీఆర్ఎస్సర్కారు పేరు చెప్పి తప్పించుకోవడం తగదన్నారు. తర్వితగతిన పెండింగ్స్కాలర్ షిప్స్ అంశాన్ని పరిష్కరించాలన్నారు.
రెండున్నరేండ్లలో విద్యలో సంస్కరణలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుతో పాటు విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని శ్రీధర్‌బాబు అన్నారు. రెండున్నరేళ్లలోనే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. అసెంబ్లీలో విద్యావ్యవస్థలో సంస్కరణలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత మార్కెట్... పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్ర యువతను రెడీ టూ వర్క్ ఫోర్స్ గా తీర్చి దిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామన్నారు. బీఎఫ్ఎస్ఐ( బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) కన్సార్టియం సహకారంతో దేశంలోనే తొలి సారిగా డిగ్రీ, ఇంజనీరింగ్ లో బీఎఫ్ఎస్ఐ కోర్సులకు శ్రీకారం చుట్టామన్నారు. మనల్ని చూసి ఈ తరహా కోర్సులను కర్నాటక, తమిళనాడు లాంటి అనేక రాష్ట్రాల్లో ప్రారంభించారని చెప్పారు.
104 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు 104 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. టీ హబ్ తరహాలోనే వరంగల్ లో ఇంక్యుబేషన్ హబ్ కె హబ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఎన్ రోల్మెంట్ 27 శాతానికి పెరిగిందన్నారు. ‘‘రూ.21వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నాం.
మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించాం. వివిధ దేశాల్లో అమలు అవుతున్న విద్యా సంస్కరణలను స్వయంగా పరిశీలించేందుకు ప్రభుత్వ టీచర్లను అక్కడికి పంపించాం. మా ప్రభుత్వం బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. రూ.500 కోట్లతో 93 కేజీబీవీలను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ గా అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించాం. టీసీఎస్ సహకారంతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రేడ్ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. మొత్తం 127 ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రేడ్ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తున్నాం’’ అని అన్నారు.
